Volcano erupts again in Iceland: ఐస్‌లాండ్‌లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. శనివారం బద్దలైన అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. భూమిలోని పగుళ్ల నుండి రాతితో పాటు లావా బయటకు చిమ్మింది. ఐస్‌ల్యాండ్ రాజధాని రేక్‌జావిక్‌కు దక్షిణంగా ఉన్న రేక్‌జానెస్ ద్వీపకల్పంలో ఈ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి.
రేక్‌జానెస్‌లో విస్ఫోటనం ప్రారంభమైందని ఐస్‌లాండిక్ వాతావరణ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. రేక్‌జానెస్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అంతేకాదు రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. శనివారం అగ్నిపర్వతం బద్దలైంది.
Also Read: Dhanashree Verma: మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు.. మనుషులుగా ఆలోచించండి! చహల్ సతీమణి ఫైర్
అమెరికాలోని కెంటుకీ రాష్ట్రం అంత విస్తీర్ణంలో ఐస్‌లాండ్ ఉంటుంది. ఇక్కడ 30 కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. దీంతో అగ్నిపర్వాతాలను చూసేందుకు ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. 2010లో ఐస్‌లాండ్‌కు దక్షిణాన ఉన్న ఇయాఫ్‌జల్లాజోకుల్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో యూరప్‌లోని చాలా ప్రాంతాలకు పొగలు వ్యాపించాయి. దాదాపు 100,000 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతేకాదు వందలాది మంది ఐస్‌లాండ్ వాసులు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు.