Site icon NTV Telugu

HYDRA: జగద్గిరిగుట్టలో హైడ్రా దూకుడు.. ముమ్మరంగా ఆక్రమణల తొలగింపు

Hydra

Hydra

HYDRA: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, తొలగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. హైడ్రా ప్రధానంగా చెరువులు, నదులు, ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌లు, రహదారులపై ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నగరంలో ప్రణాళికా ప్రకారంగా అభివృద్ధి జరగాలని, అక్రమ ఆక్రమణలతో చెరువులు, బఫర్ జోన్‌ ప్రాంతాలు నాశనం కాకుండా ఉండాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గత కొంత కాలంగా హైడ్రా ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతూ, పలు ప్రాంతాల్లో కూల్చివేతలను చేపడుతోంది.

Read Also: Supreme Court: జడ్జిలపై ఎంక్వైరీ చేయడం దారుణం.. లోక్‌పాల్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ సమీపంలో హైడ్రా అధికారులు మరోసారి ఆక్రమణలపై గట్టి చర్యలు తీసుకున్నారు. చెరువు పక్కన అక్రమంగా నిర్మించిన భవనాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఆల్విన్ కాలనీ భూదేవి హిల్స్ పరికి చెరువు సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను, వాణిజ్య భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత కొంతకాలంగా చెరువు పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, గతంలో కట్టిన కొన్ని నిర్మాణాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.

Read Also: Delhi CM Rekha Gupta: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం..

ఈ ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు పోలీసుల భద్రత మధ్య భారీ కూల్చివేత ఆపరేషన్ చేపట్టారు. ఎఫ్‌టీఎల్ (Full Tank Level), బఫర్ జోన్ అనుసంధానంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించారు. హైడ్రా చర్యలు కేవలం కూకట్‌పల్లి వరకే కాకుండా, జగద్గిరిగుట్ట, గాజులరామారం, మహదేవపురం ప్రాంతాల్లోనూ కొనసాగాయి. జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్‌ సమీపంలోని పరికి చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. అదేవిధంగా గాజులరామారం సమీపంలోని మహదేవపురం ప్రాంతంలో కొన్ని బేస్మెంట్లను కూల్చివేశారు. చెరువు పరిరక్షణ సమితి సభ్యులు గత వారం హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Exit mobile version