Hyderabad Rains Today: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ‘హైడ్రా’ అప్రమత్తమైంది. 24/7 సేవలందించే పనిలో నిమగ్నమైంది. రహదారులపై నీరు నిలవకుండా.. ఎప్పటికప్పుడు క్యాచ్పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించింది. ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆ ప్రాంతాల్లో హెవీ మోటార్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను చేసింది. కొద్దిపాటి సమస్య ఉండే ప్రాంతాలను 144గా గుర్తించి.. అక్కడ వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.
హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు 51 రంగంలో ఉండగా.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్ 150 పని చేస్తున్నాయి. మొత్తంగా 3565 మంది విధుల్లో నిమగ్నమై ఉన్నారు. 9 బోట్లను సిద్ధం చేసుకుని సమస్యాత్మక ప్రాంతాలకు వాటిని చేరవేసింది. నగరంలో 309 ప్రాంతాల్లో హైడ్రా నిత్యం నిఘా పెట్టింది. వర్షం వస్తున్నప్పుడు వరదను అంచనా వేసి మ్యాన్ హోళ్లను తెరవడం, తర్వాత మూసేయడం, క్యాచ్పిట్ల వద్ద చెత్తను తీయడం వంటి విధులో ఉన్నారు. 20 బృందాలు నిత్యం ట్రాఫిక్ పోలీసులతో ఉంటూ.. వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెట్లు పడిపోతే వెనువెంటనే తొలగించేందుకు ప్రత్యేకంగా బృందాలు ఉన్నాయి. ట్రాఫిక్జామ్లలో సులభంగా వెళ్లేందుకు 21 బైకు బృందాలు కూడా ఉన్నాయి.
Also Read: Ravichandran Ashwin: డెవాన్ కాన్వే నన్ను మోసం చేయాలనుకున్నాడు.. ఆసక్తికర విషయం చెప్పిన అశ్విన్!
212 డీవాటరింగ్ పంపులను నీరు నిలిచే ప్రాంతాల్లో హైడ్రా అందుబాటులో ఉంచింది. ఐఎండీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ, మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు జీహెచ్ ఎంసీ, ఫైర్ కంట్రోల్ రూంలలో హైడ్రా సిబ్బంది ఉంటూ ఎప్పటికప్పుడు హైడ్రా కంట్రోల్ రూంకు సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పటు చేసింది. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేయడమే కాకుండా.. జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ ఇలా సంబంధిత విభాగాలతో సమన్వయంగా పని చేస్తూ ఎక్కడా సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. హైడ్రా సిబ్బంది వద్ద వైర్లెస్ సెట్లను ఉంచి తక్షణం స్పందించేలా హైడ్రా చర్యలు తీసుకుంది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.