Site icon NTV Telugu

Hyderabad Rains: నగరంలో ఎడతెరిపిలేని వర్షాలు.. ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్..!

Hyderabad Traffic Rain

Hyderabad Traffic Rain

Hyderabad Rains: మొంథా తుఫాన్‌ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్‌నగర్‌ నుంచి మలక్‌పేట్‌ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్‌ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్‌హోల్స్‌ తెరిచి వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. దీంతో మలక్‌పేట్‌ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతే కాదు.. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. కూకట్ పల్లి JNTU నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ దగ్గర వాహనాలు అత్యంత నిదానంగా సాగుతున్నాయి.హైటెక్ సిటీ ఏరియాలో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అల్వాల్ రైతు బజార్ సమీపంలోనూ ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. దీంతో కార్యాలయాలకు, విద్యాసంస్థలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని సూచిస్తున్నారు.

READ MORE: Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

మరోవైపు.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ, హైదరాబాద్‌, జనగాం, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్‌, రంగారెడ్డి, సిద్దిపేట్‌, సూర్యాపేట్‌, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్ష సూచన జారీ చేశారు. ఈ జిల్లాల్లో మధ్యాహ్నం వరకు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

READ MORE: Gold Price Today: షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయో తెలుసా?

Exit mobile version