NTV Telugu Site icon

GHMC : ఎల్బీనగర్ సెల్లార్ కుంగిన ఘటన.. జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు

Ghmc

Ghmc

GHMC : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సీరియస్ అయింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి అనుమతుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలడంతో, సంబంధిత భవనానికి ఇచ్చిన అనుమతులను బల్దియా రద్దు చేసింది. అపార్ట్‌మెంట్ నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకపోవడంతో పాటు, బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా సెల్లార్ తవ్వకాలు జరిపినట్టు విచారణలో స్పష్టమైంది. అంతేగాక, ఈ తవ్వకాలు GHMC అధికారుల అనుమతి లేకుండా జరిగినట్టు తేలడంతో, భవన యజమాని కుస్మా రమేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్ చంద్రపురి కాలనీలో సెల్లార్ తవ్వకాల సమయంలో భారీ మట్టిదిబ్బలు ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న పలువురు కూలీలు తప్పించుకున్నప్పటికీ, మట్టిలో చిక్కుకున్న నలుగురు కార్మికుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రాము, వీరయ్య, వాసు అనే ముగ్గురు కూలీలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన భిక్షపతి ప్రస్తుతం కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, అతని కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉందని సమాచారం.

Fact Check : భారతీయులకు అమెరికా సంకెళ్లు వేసిందా? వైరల్ అవుతున్న ఫొటోల్లో నిజమెంత?

ఈ ప్రమాదంతో ఒక్కసారిగా శోకం అలముకున్న ఎల్బీనగర్ ప్రాంతంలో మృతుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను విడుదల చేయకుండా బిల్డర్ అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, గాయపడిన వారికి పరిహారం అందించాలని మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి బాధ్యత వహిస్తూ బిల్డర్‌ను కఠినంగా శిక్షించాలని కూడా వారు కోరుతున్నారు.

GHMC అధికారులు ఈ ప్రమాదంపై కఠినంగా స్పందిస్తూ, భవన యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని GHMC స్పష్టం చేసింది. మరోవైపు, ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

ఈ ఘటన భవన నిర్మాణాల్లో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి మరోసారి స్పష్టత ఇచ్చింది. నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే, అమాయక కార్మికుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని GHMC అధికారులు హెచ్చరిస్తున్నారు. భవన నిర్మాణంలో గలతలు, ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Central Election Commission: సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..