Hyderabad Cybercrime Police: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. పోలీసుల ప్రకటనల ప్రకారం.. మోసగాళ్లు సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్ డాష్బోర్డులు, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు. పౌరులు నిర్ధారించని ప్లాట్ఫారమ్లలో పెట్టుబడి పెట్టకుండా, ఆన్లైన్ లాభ వాగ్దానాలను నమ్మకూడదు అని హెచ్చరిస్తోంది.
READ MORE: Historic Decision: మహిళా సాధికారత కోసం.. యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం
1. సోషల్ మీడియా ద్వారా ప్రారంభ పరిచయం: ఫేస్బుక్, టెలిగ్రామ్ లేదా వాట్సాప్లో తెలియని వ్యక్తి నుంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా నటిస్తూ సందేశం వస్తుంది. ఆ వ్యక్తి నమ్మకం కలిగించి, త్వరగా అధిక లాభాలు వచ్చే ట్రేడింగ్ అవకాశాన్ని పరిచయం చేస్తాడు.
2.తక్కువ మొత్తంతో ప్రారంభ పెట్టుబడి: బాధితుడు మొదట చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టమని చెబుతారు. వాట్సాప్ ద్వారా నిరంతరం మార్గదర్శనం చేస్తూ నిజమైన ట్రేడింగ్ జరుగుతున్నట్టు భ్రమ కలిగిస్తారు.
3. నకిలీ లాభాలు, వాలెట్ బ్యాలెన్స్ చూపించడం: పెట్టుబడి చేసిన తర్వాత, బాధితుడికి మోసపూరితంగా రూపొందించిన ప్లాట్ఫారమ్లో నకిలీ లాభాలు చూపిస్తారు. అవి నిజమైన లాభాలేనని బాధితుడు నమ్మేలా చేస్తారు.
4. అదనపు చెల్లింపుల కోసం పునరావృత డిమాండ్లు: బాధితుడు డబ్బు విత్డ్రా చేయాలనగానే, టాక్స్, కరెన్సీ కన్వర్షన్, విత్డ్రాయల్ ఫీజులు, కంప్లయెన్స్ చార్జీలు వంటి పేర్లతో చెల్లింపులు అడుగుతారు. ప్రతి సారి చెల్లించిన తర్వాత, కొత్త కారణం చెప్పి మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు.
5. బెదిరింపులు, ఒత్తిడి: బాధితుడు సందేహించగానే, లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ లేదా వాలెట్ ఫ్రీజ్ అవుతుందంటూ భయపెడతారు.
6. దీర్ఘకాల మోసం: బాధితుడు మరింత ఎక్కువ మొత్తాలు చెల్లిస్తూనే ఉంటాడు, కానీ విత్డ్రాయల్ ఎప్పటికీ జరగదు.
7. అవగాహన, ఫిర్యాదు: చివరికి బాధితుడు మోసమని గ్రహించి 1930 – నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేస్తాడు.
ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలపై ప్రజల అవగాహన సూచనలు:
1. పెట్టుబడి చేసే ముందు ధృవీకరించండి: ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు నిజమైనవో కాదో తెలుసుకోండి. SEBI (Securities and Exchange Board of India) వద్ద రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. సోషల్ మీడియా ద్వారా వచ్చిన లింకులు లేదా ఆఫర్లను నమ్మకండి.
2. అధిక లాభాల వాగ్దానాలను అనుమానించండి: తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గ్యారంటీగా వస్తాయని చెప్పేవారిని నమ్మకండి. నిజమైన పెట్టుబడులకు ఎల్లప్పుడూ రిస్క్ ఉంటుంది.
3. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దు: బ్యాంక్ అకౌంట్ నంబర్లు, OTPలు, పాస్వర్డ్లు, UPI PINలు వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
4. “ప్రాసెసింగ్ ఫీజులు” లేదా అదనపు చార్జీలు చెల్లించవద్దు: మోసగాళ్లు పన్నులు లేదా ఫీజుల పేర్లతో డబ్బు వసూలు చేస్తారు. నిజమైన ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు ఎప్పుడూ డబ్బు అడగవు.
5. నకిలీ ప్లాట్ఫారమ్లు మరియు వాలెట్లను గుర్తించండి: అసాధారణ లాభాలు చూపించే లేదా విత్డ్రాయల్ నిరంతరం ఆలస్యం చేసే యాప్లు/సైట్లు (red flags) గా పరిగణించండి.
6. బెదిరింపులకు లోనవ్వకండి: లీగల్ యాక్షన్ లేదా అకౌంట్ ఫ్రీజ్ అవుతుందంటూ భయపెట్టినా, శాంతంగా ఉండండి మరియు తక్షణ చెల్లింపులు చేయవద్దు.
7. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించండి: 1930 – నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. తాజా సైబర్ అవగాహన అప్డేట్ల కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ – సైబర్ క్రైమ్ యూనిట్ అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరించండి.