Amberpet: ప్రస్తుత సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతి రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. పురుషులను మించి కూడా ఉద్యోగాల్లో మహిళలు రాణిస్తున్నారు. మహిళలు సాధికారిత వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కూడా ఆడపిల్ల పుట్టడాన్ని పాపంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులు. ఆడపిల్ల పుడితే బయట చెత్తలో పడేసి వెళ్లడం, ఆడపిల్ల పుట్టిందని భార్యను భర్త, అత్తమామలు ఇంటి నుంచి వెలేయడం లాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.
Read Also: Abdullahpurmet Case: అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు.. ఏడు రోజుల కస్టడీకి నిందితుడు
ఆడపిల్ల పుట్టిందని ఏడేళ్లుగా ఇంటికి రానివ్వలేదు ఆ ఇల్లాలి భర్త, అత్తమామలు. దీంతో భర్త ఇంటి ముందు బాధితురాలు ధర్నా చేపట్టింది. నేను చేసిన నేరం ఏమిటంటూ భర్త, అత్తమామలను నిలదీసింది. ఈ సంఘటన అంబర్‌పేట్‌లోని ఆర్‌కే నగర్‌లో జరిగింది. భర్త ఇంటి ముందు కూతురితో కలిసి బాధితురాలు మాధవి బైఠాయించింది. ఏడేళ్లుగా మాధవి న్యాయపోరాటం చేస్తోంది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త కిరణ్‌కుమార్, అత్తమామలు ఇంటి నుండి గెంటేసినట్లు వాపోతోంది. గత మూడు రోజులుగా భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. కానీ భర్త, అత్తమామలు ఆమెను పట్టించుకోలేదు. తనను, కూతురిని ఇంట్లోకి అనుమతించే వరకు అక్కడే ఉంటానని కూతురితో కలిసి బైఠాయించింది. తనకు తన కూతురికి న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మాధవికి పలు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.