World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్తున్నారా? అయితే… జాగ్రత్త. మీరు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ని స్టేడియంలో వీక్షించాలంటే ఐఫోన్ కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ కారణం చేత విమాన టిక్కెట్లు, హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అహ్మదాబాద్‌లోని హోటల్స్ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం 2 రాత్రులకు రూ. 43 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీరు మ్యాచ్ కోసం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్లాలనుకుంటే 10,000 రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఢిల్లీ-అహ్మదాబాద్‌ల మధ్య సాధారణంగా విమాన ఛార్జీలు రూ.3 వేలు వసూలు చేస్తారు. కానీ ఈ సమయంలో మీ పర్సు ఖాళీ అవ్వడం ఖాయం. అంతేకాకుండా.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా జోరుగా సాగుతోంది. సాధారణ ఛార్జీల కంటే క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా సరే ఎలాగైనా టిక్కెట్లు దక్కించుకోవాలనే ఆతృతతో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఇరు జట్లు వరుసగా మూడో విజయంపై కన్నేసాయి. దాయాదులతో వన్డే ప్రపంచకప్ లో పోరు అంటే హైఓల్టేజీ ఉంటుంది. అందుకోసమని ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరీ ఎల్లుండి జరిగే మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో.
