మాలీకి చెందిన ఓ మహిళ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె ప్రసవం సాధారణంగా ఏమీ జరగలేదు. మాలీకి చెందిన హలీమా సిస్సే అనే మహిళకు మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఓ పాప పుట్టింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు డాక్టర్ చెకప్‌కు వెళ్లగా.. వైద్యులు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. కానీ నెలలు గడిచేకొద్దీ హలీమాకు పొట్ట మరింత పెరిగింది. దీంతో ఏడుగురు పిల్లలు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ప్రసవం కోసం హలీమా.. మాలీ దేశం నుంచి మొరాకో వెళ్లింది. ఈ ఏడాది మే నెలలో హలీమాకు వైద్యులు సిజేరియన్ చేయగా.. ఏకంగా 9 మంది పిల్లలు జన్మించారు. వారిలో నలుగురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు.
Read Also: కోనేటిరాయుడి పూజలకు పుష్పాలు కరువు
అయితే అంతమంది పిల్లలను హలీమా ఒకేసారి ఎలా పోషిస్తుంది అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హలీమా కూడా 9 మంది పిల్లలను సాకడానికి అష్టకష్టాలు పడింది. పిల్లందరికీ పాలివ్వాలంటే రోజుకు ఆరు లీటర్లు అవసరం అవుతున్నాయని, అంతేకాకుండా ప్రతిరోజూ వారికి 100 డైపర్లు మార్చాల్సి వస్తోందని హలీమా చెప్పింది. ఆస్పత్రి బిల్లే తనకు రూ.10 కోట్ల వరకు అయ్యిందని.. అయితే అందులో ఎక్కువ శాతం బిల్లు మాలీ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపింది. ప్రస్తుతం నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడంతో మే నెల నుంచి ఇప్పటివరకు ఆస్పత్రికి సమీపంలోనే ఇల్లు తీసుకుని ఉంటున్నామని.. తమను వైద్యులు చాలా బాగా చూసుకుంటున్నారని ఆమె పేర్కొంది. పిల్లలందరూ సాధారణ బరువుకు చేరుకున్న తర్వాత తాము తమ దేశమైన మాలీకి వెళ్లిపోతామని చెప్పింది. భవిష్యత్తులో పిల్లల ఆహారం, చదువు, కనీస అవసరాలకు చాలా డబ్బు అవసరం అవుతుందని.. ప్రభుత్వం తమకు సాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు హలీమా ఆశాభావం వ్యక్తం చేసింది.