రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం అని హోంమంత్రి చెప్పుకొచ్చారు.
‘రాష్ట్రంలో మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2014 -19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు పాలనలో 7,623 కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాం. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుంది. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం. పోలీసుల వెల్ఫేర్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రమాదవశాత్తు చనిపోతే 10 నుంచి 15 లక్షల వరకు వచ్చే ఏర్పాటు చేస్తాం’ అని హోంమంత్రి అనిత చెప్పారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలపై సభ్యులు కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నలు అడిగారు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ‘కేంద్ర ప్రాయోజిత పధకాలు 94 ఉన్నాయి. 24 పధకాలను కేంద్రం ఆపేసింది. గత ప్రభుత్వం కేంద్ర పధకాలు పట్టించుకోలేదు. నిధులు డైవర్ట్ చేసింది. ప్రస్తుతం కేంద్ర పథకాలపై దృష్టి పెట్టాము’ అని పేర్కొన్నారు.