దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ.. డ్యాన్సులు వేస్తూ… హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు.
కాగా.. దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటగా.. కొన్ని ప్రదేశాల్లో మాత్రం అస్సలు ఈ వేడుకను నిర్వహించరు. వేడుక జరుపుకోకపోవడానికి.. ఒక్కో ప్రాంతానికి ఒక్కో కారణం ఉంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం… వాస్తవానికి తమిళనాడులో హోలీ సంబరాలు పెద్దగా జరుపుకోరు. హోలీ రోజున తమిళనాడులో మాసి మాగం పండుగను జరుపుకుంటారు. స్థానికులు అంతా ఈ పండుగను జరుపుకునేందుకు మొగ్గు చూపుతారు.
ఉత్తరాఖండ్‌లోని మూడు గ్రామాల్లో…
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో హోలీ పండుగ నిర్వహించరు. రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాల్లో హోలీ నిషేధించారు. స్థానికంగా కొలువు దీరిన త్రిపుర సుందరి దేవతకు శబ్దం ఇష్టం ఉండదని గ్రామస్థులు నమ్ముతారు.. ఈ దేవత తమ మూడు గ్రామాలను కాపాడుతుందని నమ్మకం. అందుకే ఇక్కడ కొన్నేళ్లుగా హోలీ జరుపుకోరు.
గుజరాత్, బనస్కాంత జిల్లా
గుజరాత్‌లో హిందు పండుగలను ఘనంగా జరుపుకుంటారు. బనస్కాంత జిల్లాలోని రామ్సన్ లో హోలీ వేడుకలు నిర్వహించుకోరు. శతాబ్ధాలుగా హోలీ జరుపుకోరట. వందల ఏళ్ల క్రితం కొంత మంది సాధువులు ఈ గ్రామానికి ఓ శాపం పెట్టారట. గ్రామంలో హోలీ జరుపుకుంటే చెడు జరుగుతుందని సాధువులు శపించారని అప్పటి నుంచి హోలీ నిర్వహించడం లేదని గ్రామస్థులు తెలిపారు.
జార్ఖండ్
జార్ఖండ్ రాష్ట్రంలోని దుర్గాపూర్ అనే గ్రామంలో రంగుల పండుగను జరుపుకోరు. రెండు శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు హోలీకి దూరంగా ఉంటున్నారు. హోలీ రోజున ఇక్కడ రాజ కుమారుడు చనిపోయినట్లు స్థానికులు చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ హోలీ జరపకూడదని నిర్ణయించారట.