NTV Telugu Site icon

High Tension in Amalapuram: అమలాపురంలో హై టెన్షన్

Amalapuram

Amalapuram

High Tension in Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు.. పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తిని హత్యకు గురయ్యాడు. కొంతమంది ‌గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేశారు. ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. వైసిపి నేత హత్యకు ప్రతిక్రియ చర్యగా దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

Read Also: Elon Musk: ప్రపంచంలో అన్నింటి కంటే ఆ విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది

అమలాపురం ఎర్ర వంతెన వద్ద సప్తగిరి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో గంధం పళ్ళంరాజు.. రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంతమంది వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ నేపథ్యంలోనే యువకుడిని హత్య చేశారని భావిస్తున్నారు. ఇరు వర్గాలు కొంత మంది రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారు. వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలోనే ఈ ఘటనలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయన్న ముందస్తు సమాచారం పై పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. డీఐజీ జీవీజీ అశోక్ ఆదేశాల మేరకు.. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.. అమలాపురంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఉభయ గోదావరి జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.. అయితే, మొత్తంగా తాజా హత్య మరోసారి అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది.