ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్ర విపత్తు శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 9వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే.. ఈ నేపథ్యంలో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి క్రమేణా వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. కడప, కర్నూలు జిల్లాల్లోని పెన్నా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఆదినిమ్మాయపల్లి వద్ద పెన్నాలో 40 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదు కాగా.. సోమశిలకు ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. సోమశిల నుంచి పెన్నా నదిలోకి 15 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగే కొద్దీ నీటి విడుదలను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పెన్నా నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.