Heavy Rain In Hyderabad on Friday.
తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి. జలాశయాలకు సైతం వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని దిగవుకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేడు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి స్వల్ప వర్షసూచన ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ మౌలాలిలో 124.8 మిల్లిమీటర్ల రికార్డు స్థాయి వర్ష పాతం నమోదయ్యింది.
బషీర్ బాగ్, నాంపల్లి అబిడ్స్, కోఠి,అంబేర్‌పేట్, బేగంబజార్, తదితర ప్రాంతాలతో పాటు అల్వాల్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ కొండాపూర్ మాదాపూర్ ప్రాంతలలో భారీ వర్షం కురియగా.. ఎల్బీ నగర్ వనస్థలిపురం, హాయత్ నగర్, బీఎన్ రెడ్డిలో వర్షం కురిసింది. అయితే ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.