Andhrapradesh Weather: రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నేడు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్ర వడగాల్పులు, 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కారు బీభత్సం..
ఎండ తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వడగాల్పులతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచనలు చేసింది. ప్రజలు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, శీతల పానియాలు తీసుకోవాలని సూచించింది. నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1 డిగ్రీలు, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.