Weather Update: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. చాలా చోట్ల ప్రజలు వేడిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉంది.. అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడి వేడిగాలులు తగ్గుతాయని పేర్కొంది. అనేక రాష్ట్రాలకు పసుపు, ఎరుపు హీట్ వేవ్ హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. రానున్న రోజుల్లో హీట్ వేవ్ రోజుల సంఖ్య కూడా పెరగనుందని ఐఎండీ తెలిపింది. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది వేడి నుండి ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు.
Read Also: Loksabha Elections 2024 : నేటితో మూడో దశ ఎన్నికల ప్రచారానికి తెర..మే 7న 94 స్థానాల్లో ఓటింగ్
ఈ రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరిక
పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కూడా వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో, తమిళనాడులోని వివిధ ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, అంతర్గత ఒడిశా, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో వేడిగాలులు వీస్తాయని అంచనా.
ఈ 4 రోజుల్లో వేడి నుంచి ఉపశమనం
మే 5 నుండి 9 వరకు అనేక రాష్ట్రాల్లో మండుతున్న వేడి నుండి ఉపశమనం పొందవచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మే 5 నుంచి 9 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజుల్లో తూర్పు ఉత్తరప్రదేశ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని తర్వాత మే 6 నుంచి 9వ తేదీ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.