స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బెయిల్ పిటిషన్, సీఐడీ అధికారుల కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. మరో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దూబే వాదనలు వినిపిస్తున్నారు. అయితే, ఈ కేసులోని ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరు అయిందని.. గత 26 రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.. ఆయనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపు లాయర్ కోర్టును కోరారు.
Read Also: Dasyam Vinay Bhasker: ఎన్డీఏ లో చేరే ఛాన్సే లేదు.. మతతత్వ పార్టీతో అవసరం అంతకన్నా లేదు
చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కోర్టులో ఆయన తరపు లాయర్ వాదించారు. అరెస్ట్ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడును విచారించార తెలిపారు. రాజకీయ కక్షలో భాగంగానే నారా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన తరపు లాయర్ కోర్టులో వాదిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీ తీసుకుని విచారణ చేశారని.. మళ్లీ కస్టడీ ఎందుకు అని దూబె వాదించారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకుపోయారు. కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై ఎలా కేసు పెడతారు అని ప్రమోద్ కుమార్ దూబే కోర్టులో తెలిపారు. ఇక, చంద్రబాబుకు సంబంధించిన ఆధారాలను కూడా సీఐడీ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ పిటిషన్లపై విచారణ పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో.. ఈరోజు కోర్టు కీలక తీర్పును వెలువరించే ఛాన్స్ కనిపిస్తుంది.