కరీంనగర్ జిల్లాలో ప్రవేటు హాస్పిటల్స్ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తోన్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేని ప్రవేటు హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని సూచించినా జిల్లా అధికారుల తూతూ మంత్రపు చర్యలు చేపడుతూ మెడికల్ మాఫియా కు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. జిల్లాలో వైద్యం వ్యాపారంగా మారడంతో ఇష్టారీతిగా ప్రవేటు హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండగా అనుమతులు లేకుండానే నడుస్తున్న హాస్పిటల్స్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది..
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుమతులు లేని, నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝళిపించాలని నిర్ణయించింది. వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ ఆసుపత్రుల ఆట కట్టి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని 15 రోజులపాటు జరిగిన తనిఖీలు తూతూ మంత్రంగా మిగిలిపోయాయి. నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. రిజిస్ర్టేషన్ లేని ఆసుపత్రులకు నోటీసులైతే ఇచ్చారు కానీ డాక్టర్లు,సిబ్బంది, కనీస వసతులు లేని, నిబంధనలు పాటించని ఆసుపత్రుల గురించి పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఉన్న 518 ప్రైవేట్ ఆసుపత్రులలో 457 ప్రైవేట్ ఆసుపత్రులను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా 80 ప్రైవేట్ ఆసుపత్రులు రిజిస్ర్టేషన్ కూడా చేసుకోకుండానే నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు. మరో 15 ఆసుపత్రులు రిజిస్ర్టేషన్ల గడువు ముగిసినా రెన్యూవల్ చేసుకోకుండానే నిర్వహిస్తున్నారు. 39 ఆసుపత్రుల యాజమాన్యాలు రిజిస్ర్టేషన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఆ ఫైల్ పెండింగ్‌లో ఉండగానే వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. రిజిస్ర్టేషన్లు లేని ఆసుపత్రులు, రిజిస్ర్టేషన్లు రెన్యూవల్ కానీ ఆసుపత్రులు ప్రజలకు వైద్య సేవలందిస్తూ కనీస వసతులు లేకున్నా, వైద్యులు లేకున్నా సేవలందిస్తున్నారనే బయటపడింది. జిల్లాలో వైద్యం వ్యాపార వస్తువుగా మారి రోగులు, వారి బంధువులు చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also:AICC President Election: గాంధీ భవన్ ఓటింగ్ సిబ్బందిపై పొన్నాల ఫైర్..
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస వసతులు ఉండట్లేదని ఆసుపత్రులలో ప్రధాన సమస్యలపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టిసారించడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. డాక్టర్లు లేక నర్సింగ్ సిబ్బంది లేకపోయినా కేవలం డాక్టర్ సర్టిఫికెట్లు మాత్రమే చూపించి ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించేందుకు అనుమతులు పొందుతున్నారని ఆరోపణలున్నాయి. కనీస వసతులు లేని ఆసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎంపీలకు, పీఎంపీలకు, అంబులెన్సు డ్రైవర్లకు కమీషన్ల ఎరచూపించి పేషెంట్లను రప్పించుకుంటూ, ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తారు, ఏ శస్త్ర చికిత్సకు ఎంత డబ్బు చెల్లించాలి అనే బోర్డులను ప్రదర్శించాల్సి ఉంటుంది.కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స కోసం దేనికెంత చెల్లించాలి అని సూచించే బోర్డులు లేవు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డమోగ్నోస్టిక్స్, ఫిజియోథెరపీ, పాథాలాజికల్ ల్యాబ్‌లు ఫీజుల విషయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తు వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాల గురించి పట్టించుకోలేదని తెలిసింది. కేవలం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆ పరిధిలో మాత్రమే తనిఖీలు నిర్వహించి తనిఖీలను కూడా అన్ని ఆసుపత్రుల్లో పూర్తి చేయకముందే ఉన్నతాధికారుల నుంచి వెంటనే నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు అందాయని ఆపేశారు.. దీంతో నామమాత్రపు తనిఖీలు కూడా నిలిచిపోయి ప్రైవేట్ ఆసుపత్రుల వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Read Also: T20 World Cup: వార్మప్ మ్యాచ్‌లో రాహుల్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..?