NTV Telugu Site icon

Hyderabad : టీబీపై యుద్ధం.. రోగుల సమాచారం ఇస్తే ఖరీదైన బహుమతి

Doctor

Doctor

Hyderabad : క్షయ వ్యాధిపై హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యుద్ధం ప్రకటించింది. ఎక్కడైనా క్షయ వ్యాధిగ్రస్తులు కనిపిస్తే సమాచారం అందించాలని నగరవాసులకు పిలుపు నిచ్చింది. అంతే కాకుండా సమాచారం అందించినవారికి బహుమతి అందిస్తామని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. క్షయ వ్యాధి(టీబీ)ని రూపుమాపేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయి నియంత్రణలో ఉన్న టీబీ రోగాన్ని పూర్తిగా రూపుమాపాలని కంకణం కట్టుకుంది. ఈ చర్యల్లో భాగంగా కొత్తగా ఎక్కడ రోగి కన్పించినా సంబంధిత వ్యక్తుల పూర్తి సమాచారం అందించాలని కోరింది. తద్వారా రోగి వివరాలు సేకరించి వారికి చికిత్స అందించాలని నిర్ణయించింది. 

Read Also: Father Kills Son: దారుణం.. ఆస్తి కోసం కొడుకు చంపిన కన్న తండ్రి

కొత్తగా క్షయ వ్యాధి నిర్ధారణ అయిన రోగి సమాచారం అందించిన ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలకు రోగికి రూ.500 చొప్పున బహుమతి అందిస్తామని అధికారులు ప్రకటించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి సెమినార్‌ హాలులో ప్రభుత్వ వైద్య అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల మెడికల్‌ డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌ వైద్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం క్షయ వ్యాధి నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మిజిల్స్‌, రుబెల్లా వ్యాధులపై ప్రైవేటు ఆసుపత్రులు అప్రమత్తం కావాలన్నారు. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు, జ్వరంతో ఎవరైనా రోగులు ఆసుపత్రిలో చేరితే ఆ సమాచారం వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు అందించాలని సూచించారు. అలాగే నగరంలోని ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ కొరఢా ఝళిపించనుంది. కొన్ని స్కానింగ్‌ కేంద్రాలు, నర్సింగ్‌హోంలు గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయని, ఇలాంటి స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని డాక్టర్‌ వెంకటి హెచ్చరించారు.