Father Kills Son: మానవ సంబంధాలు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. ఆస్తుల కోసం కన్న వారినే కడతేర్చుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఓ తండ్రి ఆస్తి కోసం కన్న కొడుకునే దారుణంగా హత మార్చాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో కన్న కొడుకును చంపిన తండ్రి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇందూరు గ్రామానికి చెందిన జానిమియాకు ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు గోరేమియా హైదరాబాద్‌లోని ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు.
Read Also: Crime News: లోన్ యాప్ వేధింపులు.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
కుటుంబ సభ్యుల మధ్య గత కొన్ని రోజుల నుంచి భూ తదగాదాలు నడుస్తున్నాయి. బుధవారం రాత్రి మళ్లీ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు జరగడంతో తండ్రి జానిమియా చిన్న భార్య కుమారుడు అయిన గోరేమియాపై కర్రతో దాడి చేశాడు. గోరేమీయాకు తలకు తీవ్రగాయమైంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే గోరేమియా హత్యలో జానిమియాతో పాటు అతడి మొదటి భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తరువాత నిందితులు పరారయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు తండ్రి తన కుమారుడిని హత్య చేసి నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. బీదర్ వెళ్లిన అతను తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోతానని చెప్పినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు.