హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్‌లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?” అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “సెంట్రల్ యూనివర్సిటీ వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోంది” అని పేర్కొన్నారు. 2003లో అప్పటి ప్రభుత్వం IMG అనే సంస్థకు ల్యాండ్ కేటాయించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసం అప్పట్లో భూమి ఇచ్చారని, కానీ ఇప్పుడు వేలం వేయాలనుకోవడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. “ఫ్యూచర్ సిటీ కోసం 45 వేల ఎకరాలను అమ్ముతామని చెబుతున్నారు, మరి ఈ 400 ఎకరాలను వదిలేస్తే ఏమవుతుంది?” అని ప్రశ్నించారు.
కేటీఆర్ రాహుల్ గాంధీ వైఖరిపై కూడా విమర్శలు చేశారు. గతంలో రెండు సార్లు రాహుల్ గాంధీ HCUకి వచ్చారని, కానీ ఇప్పుడు మాత్రం ఈ అంశంపై పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. “ఇతర రాష్ట్రాల్లో పర్యావరణంపై మాట్లాడే రాహుల్ గాంధీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ HCUకి వచ్చి విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. కానీ ఇప్పుడు వారిని ఫుట్‌బాల్‌లా తిప్పుతున్నారు” అని ఆరోపించారు. విద్యార్థులు తమను HCUకి రావాలని కోరుతున్నారని, కానీ తాము అక్కడికి వెళ్లితే సీఎం రేవంత్ రెడ్డి ‘రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ విమర్శిస్తారని కేటీఆర్ తెలిపారు.
ఈ భూ వివాదంపై తాము హైకోర్టులో పిటిషన్ వేస్తామని, పార్లమెంట్‌లో కూడా పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. “విద్యార్థుల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామని, ఈ సమస్యకు న్యాయపరమైన , రాజకీయపరమైన పరిష్కారం కోరుతామని” అన్నారు. మొత్తంగా, HCU భూ వివాదం రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల ఆందోళనలతో పాటు, ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
Blue Drum Sales: ఒక్క హత్య ‘‘డ్రమ్’’ బిజినెస్‌నే దెబ్బ తీసింది.. మీరట్ మర్డర్‌తో పడిపోయిన సేల్స్..