హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. టూర్‌లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మర్యాద పూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది.
మంగళవారం అనూహ్యంగా మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన వారసుడిగా సైనీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఇక బుధవారం హర్యానా అసెంబ్లీ జరిగిన ఫ్లోర్ టెస్టులో సైనీ ప్రభుత్వం విజయం సాధించింది. మిత్ర పక్షాల మద్దతు విశ్వాస పరీక్షలో నెగ్గారు.
హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మెజారిటీ మార్క్‌కు 46 మంది ఎమ్మెల్యేల అవసరం. JJPకి 10, INLDకి 1, కాంగ్రెస్‌కు 30, ఇండిపెండెంట్‌కి 7, HLPకి 1 ఎమ్మెల్యే ఉన్నారు.
జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విశ్వాస పరీక్షలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా కూడా మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది.
తాను సామాన్యమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చానని.. మా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని సైనీ తెలిపారు. తాను కేవలం బీజేపీ పార్టీ కార్యకర్త మాత్రమేనని.. కానీ ఈ రోజు తనకు ఇంత పెద్ద అవకాశం లభించిందన్నారు. ఇలాంటి అవకాశం బీజేపీ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుందని అసెంబ్లీలో సైనీ పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో కూడా ఖట్టర్ సలహాల మేరకు ముందుకు సాగుతానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.