Harish Rao : జనగామ జిల్లా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడుతూ, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మోటార్లు పనిచేయలేదని, చెరువులు నింపుకోలేకపోవడంతో రైతుల పంటలు తీవ్ర నష్టానికి గురయ్యాయని ఆరోపించారు. “ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గ్రహం పట్టినట్లుంది,” అంటూ హరీష్ రావు విమర్శించారు. పాలనలో అనుభవం లేకపోవడం వల్ల, వ్యవస్థలను కూల్చేసే విధంగా ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. “మీ పాలన 20-20 విధానంతో నడుస్తోంది. ఏ పని కావాలన్నా 20% కమిషన్ కట్ చేయాలి,” అంటూ ఆయన ఆరోపించారు.
గోదావరి నదిలోని ప్రతి చుక్క నీటిని ఉపయోగించి చెరువులు నింపాలి, తద్వారా పంటలు ఎండిపోకుండా వ్యవస్థను రూపొందించాలి అని హరీష్ రావు సూచించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చవిచూసిందని ఆయన అన్నారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లకు అవసరమైన 7 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో 30 రోజులపాటు మోటార్లు పనిచేయలేదని హరీష్ రావు తెలిపారు. ఫలితంగా, వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల పంట ఎండిపోయిందని అన్నారు. “మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒత్తిడి తేవడంతో 7 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇప్పుడు మోటార్లు పనిచేస్తున్నాయి, కానీ అప్పటికే రైతుల పంటలు ఎండిపోయాయి,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు దగ్గరికి వెళ్లి చేపల కూరలు తినొచ్చు కానీ, రాష్ట్రంలో నీటి సమస్యపై పట్టించుకోవడం లేదు,” అంటూ హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్ జిల్లా సహా తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.
బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, మోటార్లు సరిగా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని హరీష్ రావు అన్నారు. “కేసీఆర్ హయాంలో 99% దేవాదుల ఫేజ్-3 పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మోటార్లను ప్రారంభించి రైతులను ఆదుకోవాలి,” అని హరీష్ రావు డిమాండ్ చేశారు. హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రైతులకు రూ. 20,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తోంది. యాసంగి పంట కోత దగ్గరపడుతున్నా, వానాకాలం బోనస్ ఇంకా రైతులకు అందలేదని విమర్శించారు. “ఈ ప్రభుత్వం రైతులను మోసం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే రైతుల పోరాటానికి సిద్ధంగా ఉండాలి,” అని హరీష్ రావు హెచ్చరించారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు..