Harish Rao: ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇళ్లు, పట్టాలు ఇవ్వాలి కానీ, ఉన్న ఇళ్లను లాక్కోవడం కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రెవెన్యూ మంత్రిగా ఉంటూ జిల్లా ప్రజలను రక్షించాల్సిన వ్యక్తి భక్షిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సర్వే నంబర్ 218 భూ బాధితులతో జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా ఇక్కడి బాధితుల సమస్య తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న ఆయన.. పేదలను, జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్న పాలకుల తీరుపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా దురదృష్టం కొద్దీ మొన్న వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేస్తే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరువు పోయిందని.. ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇళ్లను లాక్కోవడం దుర్మార్గమన్నారు. జాతీయ రహదారి పక్కన పేదవాడు ఇల్లు కట్టుకుని నివసిస్తే ప్రభుత్వానికి కళ్లు మండుతున్నాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, ఇక్కడ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. సర్వే నంబర్ 218 బాధితులకు గతంలోనే ‘గృహలక్ష్మి’ పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని, వాటిని తక్షణమే వారికి ఇవ్వాలని.. లేదంటే మరో వెలుగుమట్ల తరహా ఉద్యమం పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు స్థానం కల్పించినప్పుడు, ఖమ్మంలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అంతా బ్లాక్‌మెయిల్ రాజకీయమేనని హరీష్ రావు ధ్వజమెత్తారు. గత తొమ్మిదిన్నరేళ్లలో తాము రూ. 19 వేల కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇస్తే, రేవంత్ రెడ్డి మాత్రం కాలేజీల యాజమాన్యాలను పిలిపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను, తమ హక్కుల కోసం అడిగే ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయిస్తూ వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులకు పోయేకాలం దగ్గరపడిందని, మహా అయితే ఈ ప్రభుత్వానికి మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా ప్రేమ, పనితనం, అభివృద్ధి మాత్రమే గెలుస్తాయని.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు సాగవని స్పష్టం చేశారు. బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారందరికీ కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ సమస్యపై ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, అవసరమైతే రేపు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (CS) తో కూడా మాట్లాడి, బాధితులను హైదరాబాద్ తీసుకువెళ్లైనా సరే న్యాయం చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.

