NTV Telugu Site icon

Harish Rao : “ఓ మూర్ఖులారా… సిద్ధిపేటకు వచ్చి గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి!”

Harish Rao

Harish Rao

Harish Rao : తెలంగాణలో ప్రాజెక్టుల కూల్చివేత, పాలకపక్షం-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతూ, “కొంతమంది మూర్ఖులు గాంధీ భవన్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిపోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఓ మూర్ఖులారా! ఒక్కసారి సిద్ధిపేటకి వచ్చి గలగల పారుతున్న గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి,” అంటూ హరీష్‌ రావు ఘాటుగా స్పందించారు.

హరీష్ రావు చెప్పినట్లుగా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సిద్ధిపేట జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు జిల్లాలోని రైతులకు జీవనాధారంగా మారాయని హరీష్ రావు గుర్తు చేశారు. “కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే, దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. కానీ, మీ పాలనలో కూలిపోయిన ప్రాజెక్టుల గురించి మీకు జ్ఞాపకం లేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును టార్గెట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, తమ పాలనలో జరిగిన దుర్భాగ్య ఘటనలను ఎందుకు పట్టించుకోవడం లేదని హరీష్ రావు నిలదీశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయి. ఖమ్మంలో పెద్దవాగు, నల్గొండలో సుంకేశాల ప్రాజెక్టు, మహబూబ్ నగర్‌లో వట్టేం ప్రాజెక్టు, తాజాగా SLBC టన్నెల్‌ కూలిపోయింది. వీటన్నింటిపై కాంగ్రెస్ ఏమంటోంది?” అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.

ప్రాజెక్టుల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. “మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కూలిపోతే ప్రకృతి వైపరీత్యమంటారు. మరి, మేము పాలనలో ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలైనా ఎదురైతే, అవన్నీ మా తప్పులా? మీ ద్వంద్వ వైఖరి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది,” అంటూ ఆయన ధ్వజమెత్తారు.

మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. “మల్లన్నసాగర్ నుంచి నీళ్లు హైదరాబాద్‌కు తీసుకెళతామని సీఎం రేవంత్ అంటున్నారు. మరి మల్లన్నసాగర్‌లో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచేనా లేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలను విమర్శించడం ద్వారా దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. “కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందని ప్రజలకు తెలుసు. ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా, ప్రజలు నిజాన్ని తెలుసుకునే రోజు త్వరలో వస్తుంది,” అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చను తెరమీదికి తెచ్చాయి. మున్ముందు ఈ అంశంపై మరిన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Airtel Recharge Plans: 60 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్లాన్ ఇదే.. తక్కువ ధరకే సూపర్ బెనిఫిట్స్