Site icon NTV Telugu

Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..

Harish Rao Phone Tapping Case

Harish Rao Phone Tapping Case

Harish Rao: ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పంచుకున్నారు. “హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చింది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు? ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలి. శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించి, ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండి. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని మరోసారి మనవి చేస్తున్నాం.” అని హరీష్‌ రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా.. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అపోలో ఆస్పత్రిలో శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. బంధువులకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని అప్పగించారు. స్వస్థలానికి శంకర్ గౌడ్ మృతదేహం తరలిస్తున్నారు. నిన్న ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రంలోని అనేక చోట్ల కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సమ్మెలో పాల్గొన్న శంకర్‌గౌడ్(55) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయనను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80 శాతం కాలినగాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఈ రోజు అత్యక్రియలు జరగనున్నాయి. ప్రముఖ రాజయకీయ నాయకులు హాజరుకానున్నారు.

Exit mobile version