NTV Telugu Site icon

Harish Rao : గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది?

Harish Rao

Harish Rao

Harish Rao : ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనమని, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసిందన్నారు. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయని, తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన ఆ రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితాను విడుదల చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని, దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైందని ఆయన పేర్కొన్నారు.

Saif Ali Khan: పోలీసు కస్టడీకి సైఫ్ కేసు నిందితుడు

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఈనెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చెప్పడం హాస్యాస్పదమని, అలాంటప్పుడు నాలుగు రోజుల పరిమితి పెట్టి గ్రామ సభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది? అని హరీష్ రావు అన్నారు. 400 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలను విజయవంతంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, చారిత్రక గణతంత్ర్య దినోత్సవం అయిన జనవరి 26న మరో మోసానికి సిద్ధమైందన్నారు.

దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి? మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నరు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. ఇప్పుడు గ్రామ సభల పేరిట మరో కొత్త డ్రామా చేస్తున్నరు. మల్లా దరఖాస్తులు తీసుకుంటున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Apply But No Reply అన్నట్లుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని హరీష్‌ రావు సెటైర్‌ వేశారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే కాంగ్రెస్ దృష్టి ఉందని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ది ఉంటే, గ్రామ సభల పేరిట ఎందుకు ఇంత డ్రామా? అని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’ఐటీలో మేటిగా ఉన్న తెలంగాణలో ప్రజలు పనులు వదులుకొని, రోజుల పాటు గ్రామ సభల్లో నిరీక్షించాల్సిన అవసరం ఏం వచ్చింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలనుకుంటే టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది. గ్రామ సభల సాక్సిగా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న దృశ్యాలు.. మీ పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం.’ అని హరీష్‌ రావు అన్నారు.

TPCC Mahesh Goud : తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. గేమ్‌ ఛేంజర్‌గా తెలంగాణ మారబోతుంది