కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయని తెలిపారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు. ఇవాళ నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత బలోపేతం పై సూచనలు వచ్చాయని, గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ముందుకు సాగుదామని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడ్డ వారికే పార్టీ లో గుర్తింపు ఇస్తామని, ఉద్యమ కారులకు పార్టీ లో సముచిత స్థానం ఇస్తామన్నారు. త్వరలోనే కమిటీలు వేసుకుని అసెంబ్లీ నియోజక వర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 6 గ్యారంటీ ల్లోని 13 హామీలను కాంగ్రెస్ మరో ఇరవై రోజుల్లో నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నేతలు అభిప్రాయ భేదాలు ఉంటె పక్కన పెట్టి టీం లా పని చేయాలని, ఎవరి పొరపాట్లు ఉన్నా సవరించుకోవాల్సిందేనని ఆయన తెలిపారు. తల్లి లాంటి పార్టీ ని కాపాడుకుందామని ఆయన అన్నారు.
మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడని అన్నారు హరీష్ రావు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఒక్క పైసా నిధులు తేలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలని అన్నారు. మల్కాజ్గిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచామని అన్నారు. ఇప్పుడు కూడా ఎంపీ సీటు గెలవాలని పేర్కొన్నారు. ఇది పరీక్షా సమయం.. మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అన్నారు.
కర్ణాటక లో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందని అన్నారు హరీష్. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని అన్నారు. కోడ్ బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోందని ఆరోపించారు.