సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయావ్. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోవు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది. నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుందంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను. మరోసారి చెబుతున్నా.. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం… చేయని పక్షంలో నువ్వు సిద్ధమా?” అని ప్రశ్నించారు.
కాగా.. గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత రుణమాఫీ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై పరోక్షంగా ఘాటువ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతున్నామన్నారు. ఆనాడు సవాల్ విసిరిన వారికి ఒకటే విజ్ఞప్తి.. మిమ్మల్ని రాజీనామా చేయమని కోరము. ఎందుకంటే మీరు ఎలాగు పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని, రాజకీయ ప్రయోజనాల కోసం మీలాంటి మోసపూరిత మాటలు గాంధీ కుటుంబం చెప్పదని మీరు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒకరేమో గుజరాత్ మోడల్ అని మరొకరు ఇంకేదో మోడల్ అంటున్నారు. కానీ ఈ దేశంలోని కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలవబోతున్నదన్నారు.