Hardik Pandya vs Krunal Pandya: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి అభిమానులకు మరోసారి సంబరాల వేళను అందించింది. అయితే, ఆర్‌సీబీ విజయం తర్వాత సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు జట్టును ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సంబరాల మధ్య మరో అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదే పాండ్యా సోదరుల గురించి.
ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యాకు అతని తమ్ముడు హార్దిక్ పాండ్యా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభినందన సందేశం రాకపోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. గతంలో కృనాల్ విజయాలను బహిరంగంగా ప్రశంసించిన హార్దిక్, ఈసారి మాత్రం సోషల్ మీడియాలో మౌనం పాటించడం పలు ఊహాగానాలకు కారణమైంది. గత ఏడాది ఆర్‌సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కృనాల్‌ను అభినందించాడు. “ఇప్పుడు నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. నీ గురించి గర్వంగా ఉంది సోదరా” అంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. దీంతో ఈసారి అతడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అభిమానుల్లో సందేహాలను రేకెత్తిస్తోంది.
సోషల్ మీడియాలో కొందరు అభిమానులు పాండ్యా సోదరుల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ విషయంపై హార్దిక్ లేదా కృనాల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే వారి కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు కూడా స్పందించలేదు. గతంలో కూడా పాండ్యా సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటూ పలు వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా కృనాల్ పాండ్యా అనేక సందర్భాల్లో హార్దిక్‌కు బహిరంగంగా మద్దతు పలికాడు. ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఉందని కూడా పలుమార్లు స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రాలేదనే కారణంతో వారి సంబంధాలపై నిర్ణయానికి రావడం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి స్పందన వచ్చే వరకు ప్రస్తుతం జరుగుతున్న చర్చలను ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్‌సీబీ విజయోత్సవాల్లో కృనాల్ పాండ్యా పాల్గొన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జట్టు విజయానికి అతడు అందించిన సహకారం అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది. ముఖ్యంగా తన కుమారుడితో కలిసి కృనాల్ పాండ్యా స్టేడియంలో చేసిన రచ్చ అందరినీ ఆకట్టుకుంటుంది..
