Hardik Pandya likely to out from ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తర్వాతి రెండు మ్యాచ్‌లకే కాకుండా.. మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. హార్దిక్ లిగ్‌మెంట్‌లో చీలిక వచ్చిందని, అతడికి నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని సమాచారం తెలుస్తోంది. అయితే హార్దిక్ గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన బౌలింగ్‌లోనే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హార్దిక్ కిందపడ్డాడు. ఆ సమయంలో అతడికి చీలమండకు గాయమైంది. నొప్పి ఎక్కువగా ఉండడంతో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు హార్దిక్ దూరమయ్యాడు. అక్టోబర్ 29న ఇంగ్లండ్, నవంబరు 2న శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా అయినా బరిలోకి దిగుతాడని ఆశించినా.. మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోదల్చుకోలేదు. దాంతో మరో రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ నిర్ణయించింది.
Also Read: David Warner-Glenn Maxwell: బీసీసీఐ సూపర్.. గ్లెన్ మాక్స్‌వెల్ వ్యాఖ్యలను ఖండించిన డేవిడ్ వార్నర్!
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని ఎన్‌సీఏ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ముందుగా హార్దిక్‌కు చీలమండ గాయమని భావించినప్పటికీ.. లిగమెంట్‌లోనూ చీలిక బయటపడినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. హార్దిక్‌కు కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరం అని తెలుస్తోంది. ఇదే నిజమయితే ప్రపంచకప్ 2023లో మిగిలిన అన్ని మ్యాచ్‌లకూ స్టార్ ఆల్‌రౌండర్ దూరమమవుతాడు. అయితే హార్దిక్ గాయంపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. ఒకవేళ హార్దిక్ టోర్నీకి దూరమైతే.. అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.