David Warner disagrees with Glenn Maxwell’s Light Show is dumbest idea: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బీసీసీఐ నిర్వహించిన లైట్ షోపై ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లైటింగ్ షో వల్ల క్రికెటర్లకు తలనొప్పి వచ్చేస్తోందని, తాను చాలాసార్లు ఇబ్బందిపడ్డానని మ్యాక్సీ తెలిపాడు. బీసీసీఐది ‘భయంకరమైన ఆలోచన’ అని పేర్కొన్నాడు. అయితే ఇదే లైటింగ్ షోపై ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భిన్నంగా స్పందించాడు. తాను లైటింగ్ షోను చాలా ఇష్టపడ్డానని, మైదానంలో మంచి వాతావరణం నెలకొందని దేవ్ భాయ్ అన్నాడు.
‘నేను అరుణ్ జైట్లీ స్టేడియంలోని లైటింగ్ షోను చాలా ఇష్టపడ్డాను. సూపర్బ్ వాతావరణం. ఇదంతా అభిమానులకు సంబంధించినది. ఫాన్స్ లేకుండా మేము ఇష్టపడే పని చేయలేము. అభిమానులకు ధన్యవాదాలు’ అని డేవిడ్ వార్నర్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్ లక్ష్య ఛేదన చేస్తుండగా.. డ్రింక్స్ బ్రేక్ సమయంలో స్టేడియంలో పెద్ద డీజే సౌండ్‌తో పాటు లైటింగ్ షోను నిర్వాహకులు నిర్వహించారు. దాదాపు 2 నిమిషాల పాటు ఇది కొనసాగింది. ఈ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన చేతులతో కళ్లు మూసుకున్నాడు. ఆపై షో నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Also Read: Pakistan : ఒక్క మ్యాచ్‌తో ఆస్ట్రేలియా రాతే మారిపోయింది.. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ కష్టమే!
బుధవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఆసీస్ చిత్తుగా ఓడించింది. డేవిడ్ వార్నర్ 93 బంతుల్లో 104 రన్స్ చేశాడు. వార్నర్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఈ టోర్నీలో వార్నర్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. పాకిస్తాన్ జట్టుపై దేవ్ భాయ్ 124 బంతుల్లో 163 రన్స్ చేశాడు. మరోవైపు వీర విధ్వంసం సృష్టించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీని సాధించాడు. నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లో మ్యాక్సీ శతకం బాదాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్ అయింది.
I absolutely loved the light show, what an atmosphere. It’s all about the fans. Without you all we won’t be able to do what we love. 🙏🙏🙏 https://t.co/ywKVn5d5gc
— David Warner (@davidwarner31) October 25, 2023