పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లే కాదు.. ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు కూడా ఘోరాలకు దారి తీస్తున్నాయి. ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించుకుని.. జీవితాంతం కలిసి ఉండాలని ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్లు అనతి కాలంలోనే వారి మధ్య ప్రేమలు అంతమవుతున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు, అనుమానాలు పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. మన్సురాబాద్ వాంబె కాలనీ లో ప్రేమ పెళ్లి చేసుకున్న గంగోత్రి.. కొద్ది రోజులకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read:Encounter in AP: ఏపీలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి
ఇంట్లో భర్త భాను, అత్తామామ తనను వేదిస్తున్నారని సూసైడ్ లెటర్ రాసి గంగోత్రి మృతి చెందింది. రూ.30 లక్షలు కట్నం కావాలని భర్త బాను పలు మార్లు గంగోత్రిపై దాడి చేసినట్లు సమాచారం. అత్తింటి వేధింపులను తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. అయినా తీరు మార్చుకొని భాను.. కట్నం కోసం వేధిస్తూ ఉండటంతో గంగోత్రి ఆత్మహత్య చేసుకున్నది.
ఈ విషయం తెలిసి భాను పరారయ్యాడు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.