విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్ ఉండదని కేంద్రం చెప్పిందనే ప్రచారం పచ్చి అబద్దమన్నారు. విశాఖ రైల్వే జోనుకు వయబులిటీ లేదని గతంలోనే చెప్పారని, వయబులిటీ లేకున్నా.. ఏపీకి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే రైల్వే జోన్ ఇచ్చారన్నారు.
ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది.. మళ్లీ కబినెట్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు.. బిల్డింగ్ నిర్మాణానికి కేంద్రం చర్యలు కూడా ప్రారంభించిందని, ఈ విషయాలను గతంలో పార్లమెంటులోనే రైల్వే శాఖ సమాధానమిచ్చిందన్నారు. ఇవాళ ఉదయం ఆయన రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే త్రిపాఠితో మాట్లాడానని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. భవన నిర్మాణం విషయంలో ఓ కమిటీ వేసినట్టు కూడా రైల్వే బోర్డు ఛైర్మన్ చెప్పారన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి బీజేపీ ప్రజా పోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరుగుతున్నాయని, నిన్నటి వరకు 4122 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరిగాయన్నారు.
అక్టోబర్-2 వరకు ప్రజా పోరు చేపడతామని, 5 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టాలన్న మా లక్ష్యాన్ని దాటుతామని, ప్రజాపోరులో పాల్గొంటున్న నేతలకు రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. స్థానిక సంస్థల నిధులకు సంబంధించి వైసీపీ సర్పంచులు కూడా మాకు వినతిపత్రాలు అందాయన్నారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా సమస్యలే ఉన్నాయని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే విధంగా కొత్త సమస్యలను అధికార పార్టీ తెర మీదకు తెస్తుందని జీవీఎల్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ వైసీపీ ట్రాపులో పడి ఆ డైవర్షన్ పాలిటిక్సులోనే మునిగిపోతుందని, అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వైసీపీ ట్రాపులో పడిందన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాడుతోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.