గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వెంకాయమ్మ కుటుంబంపై దాడి జరిగిందంటూ ఆరోపిస్తూ.. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ ‘చలో కంతేరు’ పేరుతో ఆందోళనలు చేపట్టింది. అయితే టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో కంతేరు ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. కంతేరులో సునీత, వంశీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగిందని.. దీనిపై ఇద్దరూ ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ వెల్లడించారు. రెండు కేసుల్లో అరెస్టులు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతలు సమస్య తలెత్తేలా గ్రామానికి వెళ్తామని చెప్పడం కరెక్ట్ కాదని డీఐజీ త్రివిక్రమ వర్మ సూచించారు. వ్యక్తిగత గొడవలను రాజకీయ గొడవలుగా సృష్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. చలో కంతేరుకు పిలుపునివ్వడం మంచిది కాదని.. వెంకాయమ్మ ఇంటి వద్ద పికెట్ పెట్టామని తెలిపారు. దుర్గి మండలంలో ఒక హత్య జరిగిందని.. వెంటనే ఆ హత్య కేసులో అరెస్టులు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ నేతల బానిసలు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారని.. అన్ని రాజకీయ పార్టీలు తమకు సమానమే అని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 150 మందితో సెక్యూరిటీ ఇస్తున్నామని.. మరి వాళ్ళు కూడా బానిసలేనా అని నిలదీశారు. పోలీసులపై అనవసరమైన కామెంట్స్ చేసి తమ మనోభావాలు దెబ్బతీయవద్దన్నారు.
కంతేరులో గొడవ వ్యక్తిగత గొడవ అని.. రాజకీయ గొడవ కాదని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ కామెంట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత గొడవలను రాజకీయం చేయడం మంచిది కాదని సూచించారు. దీని వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని.. ఈ గొడవకు సంబంధించి సీసీ కెమెరాల విజువల్స్ కూడా ఉన్నాయని ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలిపారు.
Telugu Desam Party: టీడీపీ ఆధ్వర్యంలో ‘ఛలో కంతేరు’.. మాజీ మంత్రి హౌస్ అరెస్ట్