IPL 2023 Final: క్రికెట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన పొట్టి ఫార్మాట్ ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది.. రెండు నెలలుగా క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. చెన్నై పాంచ్ పటాకానా? గుజరాత్ డబుల్ ధమాకానా అనేది ఇవాళ తేలిపోనుంది. ఐపీఎల్ 16 సీజన్ విజేత ఎవరో ఈ రోజు ఫైనల్ కానుంది.. సీనియర్ ధోనీ వ్యూహాలు ఫలిస్తాయా? చెన్నై ఫ్యాన్స్ కలల్ని సాకారం చేస్తాడా?.. లేకపోతే హార్థిక్ పాండ్యా దూకుడుతో గుజరాత్‌కు కప్ అందిస్తాడా? అనేది ఇవాళ రాత్రికి తేలిపోనుంది. క్వాలిఫైయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దెబ్బతిన్న గుజరాత్ టైటాన్స్ మళ్లీ ఫైనల్‌లో అదే జట్టుతో తలపడి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇరుజట్ల ఫైనల్ ఫైట్‌తో అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం మోతెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే ఫైనల్‌లో తలపడనుండడం విశేషం. పదోసారి ఐపీఎల్ ఫైనల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్.., ఐదోసారి కప్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఇవాళ ఫైనల్ గెలిస్తే.., ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుంది చెన్నై. గతేడాది లీగ్ దశలోనే ఇంటికెళ్లిన చెన్నై ఈసారి పట్టుదలతో, ధోని మార్క్ వ్యూహాలతో, సమిష్టి కృషితో ఫైనల్‌కు చేరింది. ఇటు వరుసగా రెండోసారి కప్ గెల్చి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలకుంటోంది గుజరాత్ టీమ్. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తలపడిన ప్రతిసారి గుజరాత్‌నే విజయం వరించింది.
ఇక, జట్ల విజయానికి వస్తే.. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఆజింక్య రహానెతో మిడిల్ ఆర్డర్‌గా పటిష్టంగా ఉంది. రాయుడు కూడా సత్తా చాటుతున్నాడు. ఫినిషర్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే, పతిరణ, దీపక్‌చాహర్, తీక్షణ, జడేజా సత్తా చాటుతున్నారు. అటు గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఏకంగా మూడు సెంచరీలు కొట్టాడు. గిల్ మరోసారి చెలరేగితే చెన్నైకు కష్టాలు తప్పవు. దీంతో గిల్‌ను త్వరగా ఔట్ చేయడంపై దృష్టి సారిస్తోంది ధోనీ టీమ్. సాహా, విజయ్‌శంకర్, హార్ధిక్‌పాండ్యాలు కూడా రాణిస్తే గుజరాత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో చెన్నైతో పోలిస్తే గుజరాత్ బలంగా ఉంది. షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ దుమ్మురేపుతున్నారు. పర్పుల్ క్యాప్ రేస్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్నది కూడా ఈ ముగ్గురే. అటు ఆరంజ్ క్యాప్ ఎలానూ శుభమన్ గిల్ వద్దే ఉంది. ఓవరాల్‌గా మిస్టర్‌కూల్ వ్యూహాలకు హార్ధిక్ పాండ్యా ఎలా చెక్ పెడతాడో చూడాలి.
ఐపీఎల్ ఫైనల్‌లో ఇరు జట్ల మధ్య సమరం మహా సమరాన్ని తలపిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ధోనీ ఐదోసారి కప్ అందుకుంటాడా లేకపోతే పాండ్యా రెండోసారి గుజరాత్‌కు టైటిల్ అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనిపించుకుంటాడా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.