GT vs RR: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, గుజరాత్ బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు నమోదు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఇక మరోవైపు జోస్ బట్లర్ 36 పరుగులతో ఆకట్టుకున్నాడు. షారుఖ్ ఖాన్ 20 బంతుల్లో 36 పరుగులు చేయగా, రాహుల్ తేవాటియా చివర్లో 12 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ 4 బంతుల్లో 12 పరుగులు చేశాడు. మొత్తంగా గుజరాత్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మంచి ప్రదర్శన చేయడంతో భారీ స్కోర్ చేయగలిగింది.
Read Also: TGPSC : గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
ఇక రాజస్థాన్ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే మహీష్ తీక్షణ కూడా 54 పరుగులు సమర్పించుకొని 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. సందీప్ శర్మ కు ఒక వికెట్ దక్కింది. రాజస్థాన్ బౌలింగ్ విభాగం ఎక్కువగా విసిరిన వైడ్ బాల్‌లు (17 వైడ్స్ సహా, మొత్తం 18 ఎక్స్‌ట్రాలు) కారణంగా గుజరాత్ టైటాన్స్ కు బాగా కలిసివచ్చింది.