NTV Telugu Site icon

Bhatti Vikramarka: దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదు..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి యేటా తమిళనాడులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా, ఇకపై ప్రతి సంవత్సరం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని, ఇందులో ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డా. శోభారాజు, హైదరాబాద్ బ్రదర్స్, హైదరాబాద్ సిస్టర్స్, కోవెల శాంత, డివి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొనడం గర్వంగా ఉందని చెప్పారు.

Read Also: OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విడాముయార్చి.. ఎక్కడ చూడాలంటే .?

తన జిల్లా ఖమ్మం నుంచే శ్రీ భక్త రామదాసు జన్మించారని, ఆ జిల్లాకు తాను ప్రాతినిధ్యం వహించడమే గాకుండా రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. తానిషా పాలనలో తహసిల్దారుగా ఉన్న రామదాసు, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించిన చరిత్రను స్మరించారు. ఈ చర్యకు తానిషా ప్రభువుల ఆగ్రహానికి గురై, గోల్కొండ కోటలో ఖైదీగా మారిన విషాద కహానీని వివరించారు.

Read Also: Ramzan Mubarak: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోడీ

చిత్రహింసలను భరించి కూడా భక్త రామదాసు తన భక్తిని కోల్పోకపోవడం, కీర్తనలు రాయడం ద్వారా భక్తి రస వాగ్గేయకారుడిగా నిలిచారని కొనియాడారు. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకొని, మరెంతో మంది సంగీత విద్వాంసులు, వాగ్దాయకారులు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించిన భట్టి విక్రమార్క, గత దశాబ్ద కాలంగా సినిమా కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గద్దర్ పేరిట గద్దర్ ఫిలిం అవార్డులను ఉగాదికి అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా, నాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి, కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కళలు కొంతమందికే సొంతం అయినప్పటికీ, ఆ కళను సమాజానికి పంచి, కళాకారులు సమాజ వికాసానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అంతటా భక్తి రసాలను పండించింది. శ్రీ భక్త రామదాసు త్యాగాలు, భక్తి, కీర్తనలు తలచుకుంటూ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.