Rajahmundry: రాజమండ్రి వద్ద గోదావరిలో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి నీరు చేరడంతో నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.79 మీటర్లకు నీటిమట్టం చేరింది.గోదావరి డెల్టాలోని మూడు కాలువలకు బ్యారేజ్ నుండి 8వేల క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 2 వేల 500, పశ్చిమ డెల్టాకు 4 వేలు, మధ్య డెల్టాకు 15 వందల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో నుండి వస్తున్న నీరు వ్యవసాయ అవసరాల కోసం కాలువలకు విడుదల చేస్తున్నారు. దీనితో బ్యారేజ్ నుండి సముద్రంలోకి ఒక చుక్క నీరు వదలడం లేదు. సాగునీరు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరితో పాటు కృష్ణా నదిలోనూ వరద పెరుగుతోంది. టీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఆ నీటిని శ్రీశైలం జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయాని ఇన్‌ఫ్లో 4,052 క్యూసెక్కులు ఉండగా.. దిగువగా నీటిని విడుదల చేయడం లేదు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి 809 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 33.7180 టీఎంసీలుగా నమోదైంది.
Read Also: Telangana DGP: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. తెలంగాణ డీజీపీ పేరుతో ఫేక్ కాల్