ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలకు భారీ ఊరట లభించింది. జూన్ 3 వరకు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్వయంగా తెలిపింది. దాంతో కగిసో రబాడా, ఐడెన్ మార్‌క్రమ్, ఫాఫ్ డుప్లెసిస్, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్.. తదితరు ప్లేయర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. త్వరలోనే ప్రొటీస్ ప్లేయర్స్ భారత్ రానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఒక వారం పాటు నిలిపివేయబడిన ఐపీఎల్ 2025.. మే 17న తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య ఆరంభం అవుతుంది. ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. మే 26న అన్ని విదేశీ ఆటగాళ్లను బీసీసీఐ విడుదల చేయాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం లీగ్ దశ మే 27న ముగియనుండగా.. ఫైనల్ జూన్ 3న జరగనుంది. ఐపీఎల్ వాయిదా పడడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లారు. తమ మొదటి ప్రాధాన్యం డబ్ల్యూటీసీ ఫైనల్ అని, ఐపీఎల్ కోసం ఆటగాళ్లను పంపడం కుదరదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే తాజాగా సౌతాఫ్రికా బోర్డు యూటర్న్ తీసుకుంది.
Also Read: IPL 2025: అవి వద్దంటూ.. బీసీసీఐకి సునీల్ గవాస్కర్ విన్నపం!
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు తమ సన్నాహక సమయాన్ని తగ్గించుకున్నామని సౌతాఫ్రికా బోర్డు డైరెక్టర్ ఎనోచ్ న్క్వే తెలిపినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ చెప్పింది. జూన్ 3 వరకు తమ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడతారని ఎనోచ్ న్క్వే స్పష్టం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికా జూన్ 3న జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఈ మ్యాచ్ రద్దు లేదా రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది.