Indian Passport: భారతీయులకు శుభవార్త.. ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్‌లే అండ్ పార్ట్‌నర్స్ సంస్థ విడుదల చేసిన హెన్‌లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత దేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో భారీగా ఎగబాకింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 8 స్థానాలు మెరుగుపరచుకొని 77వ స్థానం దక్కించుకుంది. ఇది దేశ పురోగతిగా భారతీయులు భావించవచ్చు.
ప్రస్తుతం భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్ (VOA) అవకాశాలు లభిస్తున్నాయి. ఈ దేశాల్లో మలేషియా, ఇండోనేసియా, థాయిలాండ్, మాల్దీవులు వీసా ఫ్రీ యాక్సెస్ కల్పిస్తుండగా.. శ్రీలంక, మకావ్, మయన్మార్ వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇకపోతే, 2025 ఇండెక్స్‌లో సింగపూర్ అగ్రస్థానాన్ని సంపాదించింది. ఈ దేశ పాస్‌పోర్ట్‌దారులకు ఏకంగా 193 దేశాల్లో అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. ఆ తర్వాత జపాన్, దక్షిణ కొరియా 190 దేశాలతో రెండో స్థానంలో నిలిచాయి.
మూడో స్థానంలో డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ పాస్‌పోర్ట్‌దారులకు 189 దేశాలు వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్వీడన్‌లు నాలుగో స్థానాన్ని పంచుకుంటున్నాయి. ఐదో స్థానం న్యూజిలాండ్, గ్రీస్, స్విట్జర్లాండ్ దేశాలకు దక్కింది. అమెరికా, బ్రిటన్ దేశాలు ఈ లిస్ట్ లో కాస్త వెనుకబడ్డాయి. యూఎస్ 10వ స్థానం (182 దేశాలు), బ్రిటన్ 6వ స్థానం (186 దేశాలు) లో ఉన్నాయి. సౌదీ అరేబియా ఇప్పటి వరకు 91 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ కలిగి ఉండగా, ఈ ఏడాది తొలి నుండి 4 కొత్త దేశాలను జోడించింది. అలాగే చైనా 2015లో 94వ స్థానంలో ఉండగా ఇప్పుడు 60వ స్థానానికి చేరుకుంది. అంటే 34 స్థానాల భారీ జంప్ అయ్యింది.
Supreme Court: జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు
ఇది ఇలా ఉండగా.. మరోవైపు, అఫ్గానిస్థాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో అత్యంత బలహీనంగా కనపడుతుందని పేర్కొంది. ఈ దేశ పాస్‌పోర్ట్ కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ప్రవేశం లభిస్తుంది. ఇది గ్లోబల్ మొబిలిటీ విషయంలో అత్యంత దిగువ ర్యాంకు. తాజా నివేదకు సంబంధించి హెన్‌లే అండ్ పార్ట్‌నర్స్ సీఈఓ డా. జర్గ్ స్టెఫెన్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు పాస్‌పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే కాదు… అది ఒక దేశం డిప్లమాటిక్ శక్తిని, అంతర్జాతీయ సంబంధాల నాణ్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్ అసమానతలు పెరిగిన నేపథ్యంలో స్ట్రాటెజిక్ మొబిలిటీ, సిటిజన్ ప్లానింగ్ మరింత ముఖ్యమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.