Husband Kills Wife in Goa Beach: ఎంజాయ్ చేద్దామని భార్యను బీచ్‌కు తీసుకెళ్లిన ఓ భర్త.. అందులోనే ముంచి చంపేశాడు. తన భార్య ప్రమాదవశాత్తు బీచ్‌లో పడి చనిపోయిందని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసి చివరకు దొరికిపోయాడు. ఈ ఘటన దక్షిణ గోవాలోని కాబో డి రామా బీచ్‌లో చోటుచేసుకుంది. కుంకోలిమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుంకోలిమ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ డియోగో గ్రాసియాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌కి చెందిన గౌరవ్ కటియార్ (29) దక్షిణ గోవాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. లక్నోకు చెందిన దీక్షా గంగ్వార్ (27)ను గౌరవ్ ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్దికాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. గౌరవ్‌కు వివాహేతర సంబంధం ఉందని దీక్షా ఆరోపించేది. ఈ విషయమై తరచుగా గొడవలు జరిగేవి. వివాహేతర విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు.. గౌరవ్ తన భార్య దీక్షాను చంపాలని నిర్ణయించుకున్నాడు.
Also Read: IND vs BAN: టీమిండియా కెప్టెన్‌తో బంగ్లాదేశ్ క్రికెటర్ల గొడవ.. కొట్టుకునేంత పని చేశారు!
ముందుగా అనుకున్న పథకం ప్రకారం.. శుక్రవారం దీక్షా గంగ్వార్‌ను గోవాలోని కాబో డి రామ బీచ్‌కు గౌరవ్ కటియార్ తీసుకెళ్లాడు. బీచ్ లోపలి భార్యను తీసుకెళ్లి నీటిలో ముంచి హత్య చేశాడు. ఇద్దరు కలిసి నీటిలోకి వెళ్లగా.. గౌరవ్ మాత్రమే తిరిగి రావడాన్ని బీచ్‌లో ఉన్న పర్యాటకులు గమనించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 3.45 గంటలకు మృతదేహం అలల ద్వారా కొట్టుకొచ్చింది. ప్రమాదవశాత్తు తన భార్య నీటిలో మునిగిపోయిందని, ఆమెను తాను కాపాడలేకపోయానని పాలీసులకు చెప్పాడు. భార్య దీక్షాను నీటి ముంచి చంపినట్లు ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో స్పష్టంగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేశారు. గౌరవ్‌ని పోలీసులు అరెస్టు చేశారు.