వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాలని టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే సిద్ధమవుతున్నారు. రోహిత్ ఫిట్నెస్ సాధించి కుర్రాళ్లకు ధీటుగా మారాడు. ఇక విరాట్ నిత్యం లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇద్దరు దిగ్గజాలు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరోక్షంగా హింట్ ఇచ్చినా అందరికి అనుమానాలే ఉన్నాయి. రోహిత్, కోహ్లీలు మెగా టోర్నీలో ఆడడంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ప్రపంచకప్‌కు ఇంకా రెండున్నరేళ్ల సమయముందని, వర్తమానంపై దృష్టి పెట్టడం అవసరమన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? అని అడగ్గా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ‘వన్డే ప్రపంచకప్ 2027కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. వర్తమానంలో ఉండడం ముఖ్యం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నాణ్యమైన ఆటగాళ్లు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరి అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇద్దరు ఆసీస్ గడ్డపై సక్సెస్ అవుతారని ఆశిస్తున్నా. సిరీస్ గెలవడమే మా లక్ష్యం’ అని చెప్పాడు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియా పర్యటన ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్, కోహ్లీలు ఆడనున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా సిరీస్‌తోనే వీరిద్దరు బరిలోకి దిగుతున్నారు. 7 నెలల తర్వాత మైదానంలోకి దిగనున్న ఈ ఇద్దరు ఎలా ఆడుతారో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. టీమిండియా భవిష్యత్ దృష్టా రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. గిల్ కెప్టెన్ అయినప్పటి నుంచి రోహిత్, కోహ్లీ వన్డే భవిష్యత్‌పై చర్చలు హాట్ హాట్‌గా మారాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.