Gajarla Ganesh : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామం ఈరోజు తీవ్ర ఉద్వేగానికి లోనైంది. మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ మృతి పట్ల గ్రామవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి తరువాత గాజర్ల రవికి సంబంధించిన మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం వెలిశాలలో అతని అంత్యక్రియలు జరగనున్నాయి.
గాజర్ల రవి మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఆయన అభిమానులు, మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గాజర్ల కుటుంబానికి ఇది మరో విషాద క్షణం. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఆరుగురు ఉద్యమంలో అమరులయ్యారు. గాజర్ల సోదరుడు, మావోయిస్టు మిలిటరీ చీఫ్ గా ఉన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మరోవైపు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అనారోగ్య కారణాలతో లొంగిపోయిన సంగతి తెలిసిందే.
Air India flights: ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది..? భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలు రద్దు..!
వెలిశాలలో గాజర్ల రవికి చివరి వీడ్కోలు పలకేందుకు ఆయనకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అతని విప్లవోద్యమం పట్ల అభిమానులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గాజర్ల రవి మృతి బూటకపు ఎన్‌కౌంటరేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో సుప్రీం కోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సంఘటనతో జిల్లాలో ఉద్రిక్తత పెరిగింది. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. గాజర్ల కుటుంబ విప్లవ చరిత్ర పట్ల పలువురు ప్రజలు గౌరవం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చివరి చూపుకోసం వస్తున్న జనసందోహం, ప్రాంతంలో తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తోంది.