Air India flights: అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత నుండి ఎయిర్ ఇండియా కంపెనీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో అనేక ఫ్లైట్స్ రద్దు అవుతున్నాయి. ఎయిర్ ఇండియా శుక్రవారం (జూన్ 20) భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. అయితే, ఈ నిర్ణయం విమానాల మెరుగైన మైన్‌టెనెన్స్, తీవ్ర వర్షాలు, వాతావరణం కారణంగా తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.
రద్దు చేసిన విమానాల్లో దుబాయ్, చెన్నై, ఢిల్లీ, మెల్‌బోర్న్, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబయి నగరాల మధ్య నడిచే సేవలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం, రద్దు కాబడిన విమానాలు కింది విధంగా ఉన్నాయి:
అంతర్జాతీయంగా చూస్తే..
AI906: దుబాయ్ నుంచి చెన్నై
AI308: ఢిల్లీ నుంచి మెల్‌బోర్న్
AI309: మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ
AI2204: దుబాయ్ నుంచి హైదరాబాద్
దేశీయంగా:
AI874: పుణె నుంచి ఢిల్లీ
AI456: అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ
AI2872: హైదరాబాద్ నుంచి ముంబయి
AI571: చెన్నై నుంచి ముంబయి
దీనితో ఎయిర్‌లైన్ అన్ని ప్రయాణికులకు సంబంధించి పూర్తి రీఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశాన్ని అందిస్తోంది. ‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. వారి గమ్యస్థానాలకు వీలైనంత త్వరగా చేరుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం అని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇంకా ఏదైనా సమాచారం కోసం ప్రయాణికులు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ (airindia.com)లో ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చని, లేదా కస్టమర్ కేర్ నంబర్లకు (011-69329333, 011-69329999) కాల్ చేయవచ్చని సూచించింది.
ఇది ఇలా ఉండగా, ఎయిర్ ఇండియా గురువారం (జూన్ 19) ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో జూన్ 21 నుండి జూలై 15, 2025 వరకు పలు అంతర్జాతీయ రూట్లపై విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. బోయింగ్ 787, 777 విమానాలపై ముందస్తు భద్రతా తనిఖీలను ఉద్దేశ్యపూర్వకంగా చేపట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం. అలాగే, యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గగనతల మూసివేతల కారణంగా విమాన ప్రయాణ కాలం పెరగడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.