Gadwal Surveyor Murder: గద్వాల యువకుడు తేజేశ్వర్ హత్య విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా అతన్ని హత్య చేసేందుకు కట్టుకున్న భార్య ఐశ్వర్య 5 సార్లు ప్రయత్నించింది. అటు ఐశ్వర్య ప్రియుడు కూడా భార్యను చంపేందుకు ప్లాన్ వేశాడు. కానీ వర్కౌట్ కాకపోవడంతో వదిలేశాడు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు తిరుమల రావు ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవ వరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడిపై మోజుతో తన భర్త తేజేశ్వర్‌ను చంపడానికి సిద్ధమైన ఐశ్వర్య.. అతడి బైకుకు జీపీఎస్ ట్రాకర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దాని ఆధారంగానే అతడి లొకేషన్ వివరాలను సుపారీ ముఠాకు అందజేసినట్టు తెలిసింది. బ్యాంకు మేనేజర్‌తో కలిసి భర్తను సుపారి ఇచ్చి చంపి వేసినట్లు తేలింది.
Read Also:Off The Record: కంటే కూతుర్నే కనాలి అంటారు.. కానీ ఉసురు తీసిన కూతురు
ఐశ్వర్య ఆలోచనలు మామూలుగా లేవు. పెళ్లి అయిన నెల రోజుల్లోనే భర్తను 5సార్లు చంపేందుకు ప్రయత్నం చేసింది. చివరికి ఆరో సారి అనుకున్నది సాధించింది. భర్త బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చడం ద్వారా పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది. మరోవైపు పెళ్లయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావు కూడా ఐశ్వర్య కంటే ముదురేనని తెలుస్తోంది. తన భార్యను చంపేసి ప్రియురాలితో ఉండాలని స్కెచ్ వేశాడు. తన భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో ప్రియురాలితో ఉండాలని ప్లాన్ చేశాడు.
వివాహితుడు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడని.. అప్పుడు అతడి భార్య తీవ్రంగా గొడవ పెట్టుకుందని సమాచారం. మనకు పిల్లలు లేరు కదా ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని అతడు ఒత్తిడి తెచ్చినా ఆమె ససేమిరా అనడంతో ఐశ్వర్యను తిరిగి వెనక్కి పంపేశాడు. అంతే కాదు ఐశ్వర్య తల్లితో అతనికి వివాహేతర బంధం కూడా ఉంది.
Read Also:Gadwal Murder: పెద్ద ప్లానింగే.. సర్వేయర్ హత్య విషయంలో బయటపడుతున్న సంచలన విషయాలు..!
ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఐశ్వర్యతో తిరుమలరావు వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ తో నిశ్చితార్థం జరిగి కూడా పెళ్లి రద్దు వరకు వచ్చింది. ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్.. పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంకు మేనేజర్‌తో చాటింగ్ కొనసాగించిందని.. ఎలాగైనా తేజేశ్వర్‌ను వదిలించుకుని నీ దగ్గరకు వచ్చేస్తాని బ్యాంక్ మేనేజర్‌ను ప్రాధేయపడిందని సమాచారం. దీంతో అతడు తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు కొంత మందికి 75 వేల సుపారీ ఇచ్చాడు. అతడి వద్ద డబ్బు తీసుకున్నవారిలో ప్రధాన నిందితుడైన మనోజ్ అనే వ్యక్తి. తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో అతణ్ని బయటకు తీసుకెళ్లాడు.
ఈనెల 17న తేజేశ్వర్ ను ల్యాండ్ సర్వే పేరుతో నగేష్, పరశురాం, రాజు అనే ముగ్గురు వ్యక్తులు ఇంట్లోంచి బయటకు పిలిచారు. కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ మెడ పట్టుకొని రాజు, పరశురామ్ కత్తితో పొడిచారని తెలిపారు పోలీసులు. ఆ తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న నగేష్ తేజేశ్వర్ కడుపులో కత్తితో పొడిచాడన్నారు. చనిపోయిన తరువాత కర్నూలు శివారులో మృతదేహాన్ని పడేశారు. డెడ్‌బాడీని చూసిన తరువాత సుపారీ బ్యాచ్ కి 2లక్షలు ఇచ్చాడు తిరుమలరావు. మర్డర్‌కు ముందు రోజు 20 లక్షలు బ్యాంకు నుండి డ్రా చేశాడు తిరుమల రావు.
ఆ హత్య తరువాత ఐశ్వర్యతో కలిసి లడఖ్ వెళ్లేందుకు తిరుమలరావు ప్లాన్ వేసుకున్నాడు. ఐశ్వర్యతో పరిచయం తర్వాత, భార్యను చంపేందుకు కూడా తిరుమలరావు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు పోలీసులు. తిరుమలరావుకు ఇప్పటికే పెళ్లయి 8ఏళ్లు అవుతోంది. సంతానం లేకపోవడంతో ఐశ్వర్యతో పిల్లల్ని కనాలని భావించాడు. లడఖ్ వెళ్లేందుకు హత్య జరిగిన రోజు తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు తెప్పించుకుంది ఐశ్వర్య. ఈ కేసులో పోలీసులు 8మందిని అదుపులోకి తీసుకున్నారు. తిరుమల రావు కోసం 4 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లడఖ్ వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.