Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్‌ కూలిన ఘటన.. టౌన్ ప్లానింగ్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు

Gachibowli Anjiah Nagar

Gachibowli Anjiah Nagar

Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోగా, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన కమిషనర్ సృజన.. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి (ఏసీపీ) సంతోష్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ కట్టడాల పట్ల ఆయన ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించారని విచారణలో నిర్ధారించారు.

ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడైన బిల్డర్ సాజిద్ ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఒకప్పుడు సాధారణ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్.. కక్కుర్తి అధికారుల అండదండలతో సైబరాబాద్ ఏరియాలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అత్యంత తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న స్థలాల్లో సైతం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ అంతస్తులు నిర్మించి, వాటిని పీజీ హాస్టల్స్‌గా నిర్వహిస్తూ భారీగా అక్రమ సంపాదనకు తెరలేపాడు. సాజిద్ ఖాన్ అక్రమాలపై తమకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. తాజా ప్రమాదంతో అలర్ట్ అయిన హైడ్రా.. ఇప్పుడు సాజిద్ నిర్మించిన ఇతర అక్రమ కట్టడాలను నేలమట్టం చేసే దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మరోవైపు, సాజిద్‌తో నిరంతరం టచ్‌లో ఉంటూ ఆయన సామ్రాజ్యానికి తెరవెనుక సహకరించిన ఇతర టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారుల బాగోతంపై కూడా ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో త్వరలోనే మరికొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.