Rendu Jella Sita : తెలుగునాట నవ్వుకు నాట్యం నేర్పిన రచయిత ఎవరూ అంటే ముందుగా ముళ్ళపూడి వెంకటరమణ పేరు వినిపించేది. ఏ ముహూర్తాన ‘బుడుగు’ రచనలో ‘రెండు జెళ్ళ సీత’ అన్న పాత్రను సృష్టించారో కానీ, ఆ రోజుల్లో రెండు జడలతో కనిపించిన అమ్మాయి పేరు, సీత అయినా కాకపోయినా, ఆమెను ‘రెండు జెళ్ళ సీత’ అనే పిలచుకొనేవారు, ఆమెను వలచినవారు. ముళ్ళపూడివారిని అనుసరిస్తూ, కొండొకచో అనుకరిస్తూ సాగిన జంధ్యాల ‘రెండు జెళ్ళ సీత’ టైటిల్ తోనే ఓ సినిమా తెరకెక్కించారు. ముళ్ళపూడి వారయినా, కలం బలంతోనే మురిపించారు కానీ, జంధ్యాల మెగాఫోన్ పట్టి తన మేధనంతా ప్రోది చేసి నవ్వులు పూయించడమే యజ్ఞంగా సాగిన సోమయాజి అనిపించారు. జంధ్యాల రచనతో ‘రెండు జెళ్ళ సీత’ ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కి, గిలిగింతలు పెట్టింది. 1983 మార్చి 31న ఈ చిత్రం జనం ముందు నిలచింది. వారికి కితకితలు పెట్టి మరీ గెలిచింది. శ్రీభ్రమరాంబికా ఫిలిమ్స్ పతాకంపై కె.కేశవరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇంతకూ ఈ ‘రెండు జెళ్ళ సీత’ కథ ఏమిటంటే- విశాఖ రామకృష్ణ బీచ్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే నలుగురు కుర్రాళ్ళు గోపి, కృష్ణ, మోహన్, మూర్తి ప్రేమపిపాసులు. ఒక్క అమ్మాయినైనా ప్రేమించాలని తంటాలు పడుతూ ఉంటారు. వారికి క్షవరం చేసే క్షురకుడు ఇచ్చిన సలహాతో ఓ పడచు జంటను ఇల్లు ఖాళీచేసేలా చేస్తారు. తరువాత అదే ఇంట్లోకి రెండు జెళ్ళ సీత చేరుతుంది. నలుగురూ ఎంచక్కా మనసు పారేసుకుంటారు. నలుగురూ పోటీలు పడి మరీ ఆమె ప్రేమను పొందడానికి నానా పాట్లు పడతారు. పోట్లాడుకుంటారు. చివరకు నలుగురూ ఓ నిర్ణయానికి వచ్చి, తమలో ఎవరు ఇష్టమని సీతను అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి తనకు ఇది వరకే పెళ్ళయిందని చెబుతుంది. తన ప్రేమకథను వినిపిస్తుంది. గండభేరుండం అనే డబ్బు మనిషి కొడుకు మధును ప్రేమించి ఉంటుంది సీత. వారి పెళ్ళికి రెండు లక్షలు కట్నం కింద కోరతాడు గండభేరుండం. అందుకు సరేనని సీత తండ్రి ఆ మొత్తాన్ని ఏర్పాటు చేస్తాడు. కానీ, అంతకంటే ఎక్కువ కట్నం వస్తుందని ఆశిస్తాడు గండభేరుండం. కొన్ని దొంగసాక్ష్యాలు సృష్టించి, సీతపై లేనిపోనివి కల్పించి కొడుకు మనసు విరిచేసి, పెళ్ళి జరగకుండా చేస్తాడు. అందువల్లే విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చామని చెబుతుంది. ఆమె గతం విని కరిగిపోయిన నలుగురు మిత్రులూ ఎలాగైనా సీతకు న్యాయం చేయాలని భావిస్తారు. విజయనగరం వెళ్ళి అక్కడ గండభేరుండం కూతురు కాత్యాయని మనసు పడుతున్న కామేశ్వరరావు అనే అబ్బాయిని పట్టుకుంటారు. అతనికి ఇష్టం లేకపోయినా, కాత్యాయనికి అతను దగ్గరయ్యేలా చేస్తారు. వారిద్దరి పెళ్ళి అనుకున్న సమయంలో ఫోటోలను మార్చి, గండభేరుండం చేసినట్టే, కాత్యాయనిపై ఈ నలుగురు అబ్బాయిలూ నింద మోపుతారు. దాంతో తాను చేసిన తప్పు ఒప్పుకుంటాడు గండభేరుండం. తన కూతురుకు న్యాయం చేయమని కోరతాడు. చివరకు సీత, మధు పెళ్ళితో పాటే కాత్యాయని, కామేశ్వరం పెళ్ళి కూడా ఈ నలుగురే దగ్గరుండి జరిపిస్తారు. సీత ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని ఆశీర్వదించి నలుగురూ వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.
నలుగురు కుర్రాళ్ళుగా నరేశ్, రాజేశ్, ప్రదీప్, శుభాకర్ నటించారు. రెండుజెళ్ళ సీతగా ఓ నాటి మేటి నటి పుష్పలత కూతురు మహాలక్ష్మి అభినయించగా, ఆమె ప్రియునిగా కమలాకర్, అతని తండ్రిగా అల్లు రామలింగయ్య కనిపించారు. మిగిలిన పాత్రల్లో పుష్పలత, శుభలేఖ సుధాకర్, సాక్షి రంగారావు, రాళ్ళపల్లి, సుత్తివేలు, సుత్తివీరభద్రరావు, పొట్టిప్రసాద్, శ్రీలక్ష్మి, దేవి నటించారు.
రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామమూర్తి, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పాటలు రాశారు. “లేడి వేట… ఇది లేడీ వేట…”, “రెండు జెళ్ళ సీత తీపిగుండె కోత…”, “సరి సరి పదపదని…”, “మందారంలో ఘుమఘుమయై…”, “కొబ్బరినీళ్ళా జలకాలాడి…”, “పురుషులలో పుణ్యపురుషులు వేరు…” అంటూ సాగే పాటలు అలరించాయి. తరువాతి రోజుల్లో గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకుంటూ హాస్య చిత్రాలు రూపొందించిన ఇ.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ‘రెండు జెళ్ళ సీత’ మంచి విజయం సాధించింది.