Telangana Assembly Elections 2023: రాజకీయాలు ఓ సవాల్.. కొందరిని వరుసగా విజయాలు వరించవచ్చు.. మరికొందరు ఏళ్ల తరబడి విజయం కోసం నిరీక్షించవచ్చు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు నేతలకు వరుస విజయాలు లభిస్తున్నాయి. మరికొందరు నేతలకు మాత్రం పరాజయాలే పలకరిస్తున్నాయి. నాలుగైదు సార్లు పోటీ చేస్తున్నా.. విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. గెలుపు వాకిట వరకు వచ్చి ఆగిపోతున్నారు. స్వల్పమెజార్టీతో ఓడిపోతుండటంతో.. కొంచెం కష్టపడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ప్రతి ఎన్నికల్లో వస్తోంది. మరీ ఈ ఎన్నికల్లోనూ అయినా ఆ నేతలు గెలుపుబాట పడతారా అన్నతి ఆసక్తికరంగా మారింది. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రతి ఎన్నికల్లో పోరాడుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిందేనన్న పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అనాల్సిందేనన్న అభిప్రాయంలో ఉన్నారు. కొందరు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు.
బీజేపీ సీనియర్ నేత తల్లోజు ఆచారి కల్వకుర్తిలో మూడు దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విజయం కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 1994లో తొలిసారి కల్వకుర్తి నుంచి కాషాయ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2004, 2009, 2014, 2018.. ఐదుసార్లు పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. 2014లో 32 ఓట్ల స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లోనూ కల్వకుర్తి నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సిరిసిల్ల నుంచి మూడుసార్లు బరిలో దిగిన కేకే మహేందర్‌రెడ్డి.. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు అంచుల్లోకి వచ్చారు. కేవలం 171 ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2014, 2018లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ద్వితీయ స్థానానికే పరిమితమయ్యారు. ఈ సారీ అదే పార్టీ తరఫున అదే స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మంత్రి కేటీఆర్‌ను ఢీ కొట్టబోతున్నారు.
ధర్మపురి నుంచి కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. అన్ని ఎన్నికల్లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఈసారి కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కించుకున్న లక్ష్మణ్‌కుమార్.. విజయం కోసం శక్తి వంచనలేకుండా ప్రయత్నిస్తున్నారు. బోథ్ నియోజకవర్గం నుంచి అనిల్‌జాదవ్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. రెండోస్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 28 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. వేములవాడ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఆది శ్రీనివాస్ ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2009, 2010, 2018లలో కాంగ్రెస్ నుంచి, 2014లో బీజేపీ అభ్యర్థిగా పొటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు సార్లు గెలుపు వాకిట వరకూ వచ్చి ఆగిపోయారు. ఈ సారైనా గెలిచి తీరాలన్న కసితో ప్రచారం చేస్తున్నారు.
నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తున్నారు. 2009 నుంచి నాంపల్లి నియోజకవర్గంలో విజయం కోసం ప్రయత్నిస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరపున, 2018లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగినా పరాజయమే పలకరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న ఆయన అసెంబ్లీ అడుగు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. భూపాలపల్లి నుంచి 2014, 2018లలో గట్టి పోటీ ఇచ్చిన గండ్ర సత్యనారాయణరావు.. 2023లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎన్.రాంచందర్‌రావు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి 2014, 2018లలో బరిలో దిగినా గెలుపు దక్కలేదు. 2019లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా అదృష్టం వరించలేదు. మధ్యలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. మరోసారి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.