NTV Telugu Site icon

Margani Bharat: వారిపై చర్యలు తీసుకొండి.. పోలీసులకు మాజీ ఎంపీ ఫిర్యాదు

Margani Bharat

Margani Bharat

Margani Bharat: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పోలీసులను కోరారు.. రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ పుటేజీ, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఈ సందర్భంగా మాజీ ఎంపీ అందజేశారు. సీతంపేట మూలగొయ్యికి చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారని, బాధితుని తలకు నాలుగు కుట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Noor Malabika: నూర్ మరణంపై మౌనం వీడిన కుటుంబ సభ్యులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని భరత్ కోరారు. పోలీసులు తగు చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నానని, న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాజీ ఎంపీ భరత్ చెప్పారు. ఇటువంటి దాడులు మళ్లీ మళ్లీ నగరంలో జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారం ఉంది‌ కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదన్నారు. ‌రాజమండ్రి నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నదే తమ అభిలాష‌ అన్నారు. క్రమ శిక్షణ గల పార్టీ అని చెప్పే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్భలంతోనే మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారందరి పేర్లూ అడిషనల్ ఎస్పీకి అందజేశామన్నారు. టీడీపీ క్రమశిక్షణ ఇదేనా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ భరత్.